Thursday 18 January 2007

Uday Kiron

కలల బ్రతుకు బండి ఆగిపోయింది 

"బాధని, భయాన్ని పంచుకోవడానికి 
భుజం తోడు కోసం భూతలమంతా వెదుకుతున్నాడు మనిషి!
భూగోళమంతా మనుషులే ఐనా  మనిషి ఒంటరి ఐపోయాడు! "
--------
బంజారా హిల్స్ బిల్డింగులు బాగానే వున్నాయి 
జూబ్లీహిల్స్ కొండలపైకి ఈ రోజు కూడా జాబిల్లి వస్తుంది 
కానీ,
ఉషోదయంలోనే సూర్యాస్తమయాన్ని కౌగలించుకున్న 
ఒక 'ఉదయకిరణం' అనంతలోక ప్రయాణానికి కొన్ని కన్నీటి చుక్కలు కార్చి--
ఎందుకు అని ప్రశ్నిస్తే ----"జాబిల్లిది" విహంగ వీక్షణం..... 

ఆశల "కళ"ల వెలుగులు ఆవిరైపోయాయి ,
ఇంకో వెలుగు చుక్క రాలి పోయింది!

నిన్న రాత్రి  ఏ నల్లమబ్బు  
అతని బ్రతుకు భరోసాని దెబ్బతీసిందో ..... !?

మనుషులు మాట్లాడుకోడానికి మరో వార్త!
కళాకారుడి మరణమూ కమ్యునికేషన్ కి కారణమైతే---
".................................................." 
స్పందించండి మనుషుల మద్య ఆ "శూన్యాని"కి... 
ఆ శూన్యంలో ...."మనుషుల మద్య అనుమానాలు, అభద్రతా భావాలు, 
ఎదుడివాడి ఉనికిపై అసహనం, చిరాకు, ఆత్మవిశ్వాసరాహిత్యం, భరోసా కల్పించని సమాజం వల్ల  భయాలు, అభ్యాస రాహిత్యం వల్ల  మానసిక వెలితి, ప్రేమ రాహిత్యం, పలకరింపు రాహిత్యం, వైయక్తిక మానసిక బలహీనతలు, ఓర్వలేనితనం, అసూయ, వ్యక్తిత్వనిర్మాణానికి దారి తెలియక పోవడం, వాస్తవ దూరం ఐన మనిషి ఆత్మ ప్రయాణం,...... "

ఇలాంటివెన్నో ఆ శూన్యంలో జాబిల్లి గమనించింది!

"బాధని, భయాన్ని పంచుకోవడానికి 
భుజం తోడు కోసం భూతలమంతా వెదుకుతున్నాడు మనిషి!
భూగోళమంతా మనుషులే ఐనా  మనిషి ఒంటరి ఐపోయాడు! "

ఏ వెక్కిరింత గుండెల్లో గునపంలా గుచ్చుకుందో.... 
నటుడు ఉదయకిరణ్ అసహజపు అస్తమయం 
ఈ సమాజపు డొల్లతనాన్ని, మానవ సంబందాల విచ్చిన్నతని 
మరోసారి బయట పెట్టింది!

విధి ఆడిన వింత నాటకంలో 
ఉదయ కిరణ్ 'అంతరాత్మ'  .... విల విల లాడి......
అవమానపడి, ఆత్మాభిమానం దెబ్బ తిని 
కొత్త బ్రతుకును, కొత్త వెలుగును నిర్మించుకోలేక ---
ఈ లోకం పోకడ , ఈ లోకం లోతును  తెలుసుకోలేక,
డాంబికాలు అర్థం కాక------

"కొండ ఎక్కిస్తానన్న కొండంత 'ఆశ'
అధఃపాతాళానికి తోసేస్తే ---"

ఆ చీకటిలో భయపెడుతున్న గబ్బిలాలను చూసి 
ఎన్ని రాత్రులు జడుసుకున్నాడో.... పాపం!
అనంతలోకాల వైపుకు అదృశ్య ప్రయాణానికి సాహసించాడు!

ఇక్కడ మనిషి మరణం కన్నా
ఒక కళాకారుడి "భరోసా" చనిపోవడం 
బాధని, భయాన్నీ కల్గిస్తోంది! 

లోకంలోని "జుగుప్స"ని Extreme Close Shot లో తట్టుకోలేము!!

రండి రేపు మళ్ళీ తెల్లవారుతుంది
camera ని మల్లెల తెల్లదనం వైపుకు, 
సాగర్ బుద్దుడి శాంతవదనం వెనుక వెచ్చటి సూర్యోదయం వైపుకు Focus చేసి...." All is WELL with the world" అని అబద్దపు ప్రచారాలు... మళ్ళీ మళ్ళీ.... చేద్దాం!
(మాయ చేయడం, అబద్దాలను నిజంగా భ్రమింపచేయడం మనకు అలవాటేగా!)

మనిషి లేనప్పుడు ఆ మనిషిని గురించి హీనపరుస్తూ మాట్లాడడంలో మనుషులు నిష్ణాతులు ఐపోయారు! కత్తులతో ఒకరి గుండెలను ఇంకొకరు కోసుకుంటూ------గాయపరుచుకుంటూ ----
-------------------
మనం మాట్లాడుకోవాలంటే ..... మళ్ళీ 
ఇలాంటి వార్త అవసరం లేని ఆదర్శ ప్రపంచం వైపుకు అడుగులు వేద్దాం!
(శూన్యంలోని చీకటి వైపుకు వెలుగు కిరణాలను వేగంగా పంపిద్దాం)

ఇంకో ఉదయం అస్తమించకూడదు అసహజంగా!

కలల బ్రతుకు బండి 
'కళ'ల వెండి వెన్నెల  వైపుకు.... 
నిరంతరం సాగిపోతూనే ఉండాలి!

                           (ఉదయ కిరణ్ ఆత్మహత్యకు షాక్ అవుతూ....,ఆ కళాకారుడికి నివాళి అర్పిస్తూ--)

      -----శ్రీనివాస రాజు.పి(Theatre Research Scholar & Media Teacher)
             06-01-2014