Tuesday 16 June 2009

SATYANYESHANA

సత్యాన్వేషణ  
ఏదోలా , నా 
జీవితం హాయిగా గడిచిపోతే చాలు!

ఏదోలా, నా 
పిల్లల జీవితమూ సౌఖ్యoతో వెళ్ళిపోతే చాలు!

ఏదోలా, నా 
మనుమల జీవితమూ బంగారంలా వెళ్ళిపోతే చాలు!

ఏదోలా, నా 
వంశమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లితే అది చాలు!
అంతే!!
________________*****************__________
మిగతా 
సమాజమంతా ఎలాపోతే, నా 
కేంటి?
మిగతా జనులంతా ఏ బాధలు పడితే, నా 
కేమి?
మిగతా 
ప్రజలు ఏ దౌర్జన్యానికి బలైపోతే , నా 
కెందుకు?
_________*******________
చాలామంది 
దోపిడీ పదఘట్టన క్రింద 
నలిగిపోతున్నారంట !
ఐతే ఏమి? నా 
కేం కాలేదుగా, అందుకే 
దాని గురించి ఆలోచించను !
నిజం చెప్పాలంటే 
ఆ 'దోపిడీ' ఏంటో---
నాకు సరిగా అర్థం కాదు 
అర్థం కాని దాని గురించి ......
ఆలోచించడం ఎందుకు? అందుకే, 
అటువైపు ఆలోచనలను కదలనివ్వను!
మరొక వైపు ,
మతమో, కులమో,   
"ప్రాంతమో--------------"
మరొక రాజకీయ రాకాసి నీడో ---
మరికొందరి బ్రతుకుల వెలుగులను 
చీకటమయం చేస్తున్నాయంట 
అయితే ఏమి?
ఆ చీకటి -
నా జీవిత వెలుగును శాసించలేదు !
అందుకే, నేను, ఆ 
గొడవల గురించి అసలు పట్టించుకోను!
----------********----------
ఇక నాగురించి,
నేను --
నా వ్యక్తిగత విజయాన్ని 
ఎంతో కష్టించి , ఎంతో  కష్టించి,
సొంత ప్రతిభతో సాదించుకున్నాను !
నేను,
మీ బాధల గురించి ఆలోచించి వుండి  వుంటే -- 
నా సమయం ఎంతో వృధా అయ్యి వుండేది !
అందుకే ఆలోచించలేదు !
దీన్ని స్వార్ధం అంటారా?!
అనుకోండి! నేను లెక్క చేయను!
------******--------
నేను కోరుకొనేది.......
ఏంతో ప్రశాంతమైన జీవితాన్ని!
అది నాకు ఈ సమాజంలో దొరుకుతోంది !
కాకపోతే ....
మొదట్లో ....
ఆస్థులు కూడబెట్టడానికి,
ధనాన్ని రాశిగా చేయడానికి ---
కొంత కష్టపడాల్సి వచ్చింది! నిజమే ,
నా మిత్రులు కొందరు,
ఆ కష్టం కూడా చెయ్యకుండానే,
తరతరాల వారసత్వపు భూములను , ఆస్థులను ,
సొంత ఆస్థి అనే హక్కుతో ,
మేం యజమానులం అనే అజమాయిషితో---
సౌందర్యవంతంగా--
అనుభవించేస్తున్నారు! అదృష్టవంతులు వాళ్ళు!     
వాళ్ళను చూస్తే కొంచం జెలసీ  నాకు!
------******-------
సరే--
బుద్ధిపుడితే, అపుడపుడూ -
నేనూ కొన్ని దానాలు ధర్మాలు కూడా చేస్తాను!
దాని ద్వారా నాకు బోల్డంత కీర్తి!
ఈ సమాజం నన్నో పెద్దమనిషిగా గుర్తించి గౌరవిస్తుంది !
(ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా ఇస్తుంది )
మరి అటువంటి ఈ సమాజం ,
సరిగా లేదు , తలక్రిందులుగా వుందంటే నాకు కోపం రాదూ !???
ఎవడెలా పొతే, నా 
కేంటి? 
నా, 
బ్రతుకు బాగుగానే వుంది !
మీ గొడవలు , బాధలు నన్ను ప్రభావితం చేయడం లేదే?!   చెయ్యవు కూడా !
మీకో విషయం తెలుసా ?
అసలు, నే నవేవీ పట్టించుకోను !నా 
చూపు అసలటు వైపు వెళ్ళదు !
అందుకే, నే 
నెంతో హాయిగా బ్రతుకుతాను !
సుఖ సంతోషాలతో , సౌఖ్యంతో --
జీవితాన్ని గడుపుతాను!
-----*****--------
మరి మీరేమో 
కొందరు, విప్లవం, వర్గపోరాటం, భూమిపోరాటం ,
మార్క్సిజం ,  దళిత, స్త్రీ వాదాలంటూ ---
వెర్రి వేషాలతో బ్రతుకును 
గందరగోళ పరుచుకుంటారు !
ఎందుకో నాకర్ధం కాదు !
నా
కవన్నీ అనవసరం !
------******-------
అందుకే 
ఏదోలా, నా 
జీవితం, నా 
పిల్లల జీవితం , నా  
మనుమల జీవితం , నా 
వంశమంతా కూడా ....
సుఖసంతోషాలతో --
హాయిగా ----
వర్ధిల్లాలని ,
ఆ పరమాత్ముణ్ణి కోరుకుంటాను !
-------*****-------
దేనికైనా పెట్టిపుట్టాలి కదా ,
సుఖంగా బ్రతకటానికి --
నేను పెట్టిపుట్టాను !
ఇది నా ప్రారబ్ధం !
కష్టాల్లో మగ్గడం ,
చాకిరీ చెయ్యడం ,
అర్థాకలితో  మాడడం --
మీ ప్రారబ్ధమేమో !
ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు ?
అయినా, నిరంతరం మేము, 
మీకు భక్తి బోధనలు చేస్తూనే వున్నామే !
ఆద్యాత్మిక చింతనను కల్గిస్తూనే వున్నామే !
అందుకే మనసు పెట్టి ,
ఇకనైనా "విషయాన్ని" అర్థం చేసుకుని ,
శాంతంగా , బుద్దిగా మసులుకోండి !
------*****-------
మీరు కూడా మిగతా గొడవలు మానేసి , 
సొంత జీవితం పై శ్రద్ధ పెడితే --
నాలా పైకొస్తారు! సుఖపడ తారు !
ఎవడెలా పొతే , మీ  
కెందుకండి?
ఎదుటివ్యక్తి పడే బాధ , మీ 
శరీరానిది కాదు !
అందుకే స్పందన అనవసరం  
క్షతగాత్రుడివి నీవు కానప్పుడు 
మౌనంగా ఉండడమే గొప్ప వివేకం!   
మీ శరీరానికి గాయం అయితే ,
నొప్పి తెలుస్తుంది ! కనుక ,
అప్పుడు పడే బాధకు అర్థం వుంది !
మిగతా అర్థం లేని స్పందనలన్నీ 
సమయాన్ని వృధా పరిచేవే!! 
----------*****--------
మీ గురించి మీరు ఆలోచించుకోండి !
"సమాజం బాగోలేదు 
దీన్ని బాగుచేద్దాం " అని 
బయల్దేరడం శుద్ధ దండుగ !
-------*****--------- 
నేను 
చెప్పాల్సింది చెప్పాను!
తర్వాత మీ ఇష్టం 

                                 శ్రీనివాస రాజు .పి 
                                   --14-02-1996
                                 Cell No :- 810 6871 802