ఒక నిష్క్రమణం
కలల వెలుగును అందుకోవాలని--
కళల వెలుగులో ప్రయాణం సాగించాడు ఒక సూర్యుడు !
దారిలో పున్నమి చంద్రుడు పలకరించాడు
శిశిరం దాటిన వసంతుడు ముందుకెల్లమన్నాడు
వర్షరుతువులో పిల్లల కాగితం పడవ ఆటలు అతనికి ఆహ్లాదాన్ని పంచాయి !
శరత్కాలపు వెన్నెల ప్రేమ కబుర్లు చెప్పింది
శరత్కాలపు వెన్నెల ప్రేమ కబుర్లు చెప్పింది
-------
కలల బ్రతుకు బండి కళల వెండి వెన్నెల వైపుకు సాగుతోంది
ఇంతలో చిన్న అలజడి!
సూర్యుడు మసకబారాడు.
------
కృష్ణుడి వెలుగు , రాముడి మనసు , రామకృష్ణుడి మనసంతా మంచితనం.
ఎపుడూ పెదవులుపై చిరునవ్వులు ఒలికించే సోదరుడు.
ఇంత దారుణానికి ఎలా సాహసించావు మిత్రమా ?!
(ఎందరో సూర్యుల ప్రయాణాలు సాగుతున్నాయి
ఒక్కో సూర్యునిది ఒక్కో కష్టం , ఇక్కడ ఎవరు సుఖంగా వున్నారు చెప్పు?
చిన్ని ఆశతో మొండి ధైర్యంతో ముందుకెల్తున్నారు తప్పితే )
అకస్మాత్తుగా ఒక సూర్యుడు శాశ్వతంగా అస్తమించాడనే వార్త !
ఆ సూర్యుడు పేరు రామకృష్ణ , స్నేహితులకు 'కిట్టు' గా సుపరిచితుడు !
-------
కలల వెలుగుని అందుకోలేనని
కళల వెలుగులో ప్రయాణం సాగించలేనని
కృష్ణపక్షపు చంద్రున్ని చూడలేనని,
శిశిరంలో చిక్కుకున్న వసంతుడు ఇక రాడని.
శరత్కాలపు కళల వెన్నెల ఒక బూటకమని ....ఏమనుకున్నాడో తెలీదు .......!
అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!
(మా చెల్లెలు ఇందిర, బంగారు ముద్దుల పాప త్రైలోక్యలను ఒంటరి చేసి )
"నేను ఓడిపోయాను" అనే చివరి మాటలు వదిలి!
"దేహముంది , ప్రాణముంది , నెత్తురుంది, సత్తువుంది ...,ఇంతకన్నా సైన్యముండునా?"
కవి మంచి మాటలు మర్చిపోయాడు.
ఒక మంచి మనిషి , ఒక మంచి కళాకారుడి అసహజపు నిష్క్రమణం...
ఒక చర్చగా, ఒక ప్రశ్నగా ,
రంగస్థలముపై ఫలయోగాన్ని చేరుకోని కార్యముగా.....
ఒక హెచ్చరికగా మిగిలింది !!!
--------
మిత్రమా నీకిదే మా అందరి కన్నీటి వీడ్కోలు!
--------శ్రీనివాసరాజు .పి
22 -02 -2012
(కిట్టు మరణవార్తను మాకు చెప్పినపుడు "హను" sir కళ్ళల్లో కన్పించిన
కన్నీటి తడికి ఆర్ద్రతతో .....)
No comments:
Post a Comment